: అమరావతి సమీపంలో పెనుమాక భూముల కోసం నోటిఫికేషన్... ఖండించిన వైకాపా
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూ సమీకరణ చేసిన సమయంలో, తమవి మిగతా భూముల కన్నా విలువైనవని, విజయవాడకు అత్యంత సమీపంలో ఇప్పటికే అభివృద్ధి చెందినందున భూములు ఇవ్వలేమని చెప్పిన తాడేపల్లి మండలం పెనుమాక భూముల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భూ సేకరణ నోటీసును జారీ చేసింది. మొత్తం 660.83 ఎకరాల సేకరణ నిమిత్తం 904 మంది యజమానుల పేర్లను తెలుపుతూ నోటిఫికేన్ జారీ అయింది.
ఇక ఈ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వైకాపా, ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడుతోందని ఆరోపించింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ సరిగా జరగలేదని రైతులు కోర్టును ఆశ్రయించిన వేళ, కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కోరిన చంద్రబాబు ప్రభుత్వం, ఈలోగానే నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసును వేయనున్నామని తెలిపారు.