: టీడీపీతో అమీతుమీయేనా? పవన్ వ్యూహమేంటి?... రాజకీయ వర్గాల్లో తాజా ట్వీట్ల కలకలం!


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం - బీజేపీ కూటమి, ఆపై ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి, హోదా స్థానంలో సాయం చేస్తామని చెబుతూ, ప్రజలను మభ్యపెడుతుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారా? ఇకపై తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుంటారా? వైకాపా సభ్యులు బాగా పనిచేస్తున్నారని కితాబివ్వడం వెనుక అర్థమేంటి? ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన పవన్, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
 
2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి విజయానికి పవన్ కల్యాణ్ ప్రచారం ఎంతో కొంత సహకరించిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత స్పెషల్ స్టాటస్ ఇవ్వలేమని, 14వ ఆర్థిక సంఘం అంగీకరించదని, వేరే రాష్ట్రాలు పోటీకి వస్తాయని కుంటి సాకులు చెబుతూ, స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్రం చెప్పింది. దానికి తెలుగుదేశం కూడా వంతపాడి, హోదాతో ప్రయోజనాలు శూన్యమని, ప్యాకేజీతో నిధులు వస్తాయని ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో వైకాపా, కాంగ్రెస్ పార్టీలు మాత్రం, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాల్సిందేనని పోరాటం చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో జరిగిన రభస కూడా అందరికీ తెలిసిందే. ఆ బిల్లుపై ఓటింగ్ జరిగితే ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న బీజేపీ, దాన్ని మనీ బిల్లుగా ప్రకటిస్తూ, తప్పించుకుంది.

ఇక తనకు అవకాశం వచ్చినప్పుడల్లా హోదా కోసం మాట్లాడుతూనే ఉన్న పవన్ కల్యాణ్, తొలిసారిగా టీడీపీ ఎంపీలే లక్ష్యంగా కాస్తంత కఠినమైన వ్యాఖ్యలే చేశారు. విభజన సమయంలో జరిగిన ఘోర అవమానాన్ని టీడీపీ ఎంపీలు మరచిపోయినట్టుందని, స్వీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని ఆయన అన్నాడు. సంయమనం సరైనదే అయినా, ఇంకా ఓపిక పట్టడంతో వచ్చే లాభమేంటని టీడీపీని ప్రశ్నించారు. పనిలో పనిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజునూ పవన్ టార్గెట్ చేసుకున్నారు. ఎంపీలు హోదా కోసం మాట్లాడుతున్న వేళ, ఒక్క మాట కూడా మాట్లాడని ఆయన వైఖరి తనను బాధించిందని తెలిపారు. హోదా హామీని ఇచ్చిన తరువాతే తెలుగుదేశం, బీజేపీలకు ప్రజలు ఓట్లేశారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ పవన్ ఏం మాట్లాడినా, ఆయన్ను విమర్శించకుండా వస్తున్న టీడీపీ, ఇప్పుడెలా స్పందిస్తుందో వేచి చూడాలి.

బహిరంగ వేదికలపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు, తన సోషల్ మీడియాలోను బీజేపీ నేత వెంకయ్యనాయుడినే తొలి టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించిన పవన్, తెలుగుదేశం నేతల పేర్లు ప్రస్తావించినా అంత ఘాటు విమర్శలు మాత్రం చేయలేదు. ఇక ఇప్పుడు టీడీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News