: తాతగా బ్రహ్మానందంకి ప్రమోషన్!
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు ప్రమోషన్ వచ్చింది. హనుమాన్ జయంతి రోజున తను తాతయ్యగా ప్రమోట్ అయ్యానని ఆయన తెలిపారు. సరిగ్గా హనుమాన్ జయంతి రోజు తన కుమారుడు గౌతమ్- జోత్స్న దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడని ఆయన చెప్పారు.
‘‘పండగ రోజు మా ఇంట్లో మరింత ఆనందం వెల్లివిరిసింది. పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మా ఇంట్లోకి మనవడు వచ్చాడు. మనవడి రాకతో మా ఇల్లు సంతోషవనమైంది’’ అంటూ ఆయన తన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో హీరోగా మారిన గౌతమ్ టాలీవుడ్ లో బ్రహ్మానందం ఆశించిన స్థానం సంపాదించలేకపోయారు. తాజాగా ఆయన ‘మను’ అనే చిత్రంలో చాందిని చౌదరితో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తైందని, వచ్చే నెలలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.