: తెలంగాణలో దళితులకు రక్షణ లేదు.. ఆయుధాలివ్వండి: మంద కృష్ణమాదిగ డిమాండ్
తెలంగాణలో దళితులకు ఆత్మరక్షణ లేదని, వారికి లైసెన్స్ కలిగిన ఆయుధాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. హన్మకొండలోని హరిత కాకతీయ టూరిజం హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యకేసుల్లో స్వయంగా ప్రజాప్రతినిధులే నిందితులుగా ఉంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మధుకర్, రాజేష్ మృతి ఘటనలను మంద కృష్ణ ప్రస్తావించారు.
ఇవన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పుట్టమధు, జీవన్‌రెడ్డిలు పరోక్షంగా చేయించిన హత్యలేనని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో 86 మంది హత్యకు గురికాగా, 233 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 4 వేలకు పైగా దాడులు జరిగాయన్న విషయాన్ని స్వయంగా డీజీపీ అనురాగ్ శర్మే తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీలపై అఘాయిత్యాలను సమీక్షించే పరిస్థితి లేకపోవడం దారుణమన్న మంద కృష్ణ, దళితుల ఆత్మరక్షణ కోసం లైసెన్స్‌డ్ ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.