: ‘డెయిలీ మెయిల్’పై పోరులో ట్రంప్ సతీమణి మెలానియాదే విజయం
ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెయిలీ మెయిల్’పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ విజయం సాధించారు. మెలానియా గతంలో వ్యభిచార వృత్తిలో ఉండేవారని పేర్కొంటూ డెయిలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై మెలానియా మేరీల్యాండ్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీంతో డెయిలీ మెయిల్ యాజమాన్యం మెలానియాతో రాజీకి వచ్చింది. ఈ విషయాన్ని పత్రిక స్వయంగా తెలిపింది. మెలానియాకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆమెకు 2.9 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, మెలానియా 150 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు) డిమాండ్ చేశారు.
మెలానియా 1990లలో వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్) ఉన్నారని, ఈ విషయాన్ని ఆమె పనిచేసిన మోడలింగ్ ఏజెన్సీ నిర్వాహకుడే చెప్పాడని పేర్కొంటూ గతేడాది ఆగస్టులో డెయిలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెయిల్ ఆన్‌లైన్‌తోపాటు మరో నాలుగు వార్తా సంస్థలు కూడా ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలపై స్పందించిన తన పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ దావా వేశారు. దీంతో స్పందించిన పత్రికలు ఆ కథనాన్ని తొలగించి క్షమాపణలు చెప్పాయి.