: నేను, నా కుటుంబ సభ్యులు టీడీపీని వదిలే ప్రసక్తే లేదు: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
ఇటీవల పదవి కోల్పోయిన ఏపీ అటవీ శాఖ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఈ రోజు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ, ‘నేను, నా కుటుంబ సభ్యులు టీడీపీని వీడే ప్రసక్తే లేదు. 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు..ఇది విశ్రాంతి సమయంగా భావిస్తున్నా. నేను పార్టీ మారుతున్నాననే విషయమై కార్యకర్తలు అపోహలకు గురికావద్దు’ అని సూచించారు.
కాగా, కొంత కాలంగా బొజ్జలకు అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలకబూనిన బొజ్జల పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్ లు బొజ్జల నివాసానికి వెళ్లి ఆయన్ని బుజ్జగించిన విషయం విదితమే.