: నేను వార్నింగ్ ఇచ్చేవాడినే అయితే కోర్టును ఆశ్రయించేవాడినే కాదు!: వంగవీటి రాధా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రం టైటిల్ దగ్గర నుంచి కథనం వరకు మొత్తం తప్పుగా చిత్రీకరించారంటూ వంగవీటి మోహన రంగా తనయుుడు వంగవీటి రాధా విజయవాడలో స్థానిక కోర్టులో ఈ రోజు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు.. ఇలా ప్రతి ఒక్కటీ తప్పుగా చిత్రీకరించారు. ఈ వివరాలన్నింటినీ సేకరించి కోర్టులో అందజేశాం' అన్నారు.
గతంలో కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘హైకోర్టులో కేవియట్ ఫైల్ చేసుకున్నారు. ఆ తర్వాత మేము కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఆ రోజు పిటిషన్ దాఖలు చేశాము. సినిమా ట్రైలర్, అభ్యంతరకర సన్నివేశాలను ఎత్తివేయాలంటూ ఆ రోజున పిటిషన్ దాఖలు చేశాము. ఆ సన్నివేశాలను తొలగిస్తామని చెప్పి అప్పుడు , సినిమా రిలీజ్ తర్వాత కూడా వర్మ మోసం చేశాడు. వర్మ పర్సనల్ ఒపీనియన్ ని సినిమా తీసి చూపించడం కరెక్టు కాదు.
మా పరువుకు భంగం కలిగించేలా ఈ సినిమా తీశారు. టైటిల్స్ లో కల్పిత పాత్రలు అని చెప్పకుండా నేరుగా వంగవీటి రంగా, వంగవీటి రాధా అని పేర్లు పెట్టారు. వంగవీటి రంగాను సినిమాలో రౌడీ పాత్రలో చూపించారు. నా తల్లి రత్నకుమారిని హత్యలు ప్రోత్సహించే పాత్రలో చూపించారు. మమ్మల్ని సంప్రదించకుండానే కుటుంబ చరిత్రను వర్మ తన ఇష్టానుసారంగా తీశారు. అసలు కథ తెలియకుండా తీశాడు... నేను ఎవరికీ వార్నింగ్ ఇవ్వడం లేదు. వార్నింగ్ ఇచ్చేవాడినే అయితే కోర్టును ఆశ్రయించేవాడినే కాదు. దర్శకుడు వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, సహ నిర్మాత సుదీప్ చంద్ర పై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టాను’ అని వంగవీటి రాధా అన్నారు.