: 14 నుంచి 20 వరకు 'గులాబీ కూలీ దినాలు'గా ప్రకటిస్తున్నా.. నేను కూడా రెండు రోజులు కూలి చేసి సంపాదిస్తా!: కేసీఆర్
తెలంగాణ మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ తాము తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఈ నెల 21న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. కొన్ని రోజుల్లో జూన్ 2 రానుందని, ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటుందని, తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏడాది టీఆర్ఎస్ మెంబర్ షిప్ 75 లక్షలు దాటిపోతుందని, ఎంతో అద్భుతమైన స్పందన వస్తుందని, సభ్యత్వ రుసుం పెంచినప్పటికీ ఎంతో మంది చేరుతున్నారని అన్నారు.
ఇంత భారీగా సభ్యత్వం ఉండే కొన్ని పార్టీలలో టీఆర్ఎస్ ఒకటిగా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. ఉద్యమపార్టీ అయిన టీఆర్ఎస్ ప్రజల మన్ననలను అందుకుంటుందని, నీతి అయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుందని అన్నారు. టీఆర్ఎస్ సభ ఎంతో గొప్పగా జరగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరికి వారే తమ ఖర్చులు పెట్టుకొని సభలకు రావాలని అన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటిస్తున్నానని, కార్యకర్త నుంచి సీఎం వరకు అందరూ ఇందులో పాల్గొనాలని, ఈ తేదీల్లో ఏవైనా రెండు రోజులు కూలీ చేసి డబ్బు సంపాదించాలని అన్నారు. తాను కూడా రెండు రోజులు కూలీ చేసి సంపాదిస్తానని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వహించనున్న సమావేశాలకు ఎవరి ఖర్చులు వారే పెట్టుకోవాలని, అందుకోసం రెండు రోజులు కూలీ పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటిలాగే పార్టీ అధ్యక్ష ఎన్నికను నాయిని నర్సింహారెడ్డి చేపడతారని అన్నారు.