: పాకిస్థాన్ వెళితే చంపేస్తారంటున్న ఆ దేశ గూఢచారి.. భారత న్యాయవ్యస్థపై నమ్మకముందని వ్యాఖ్య!
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించినట్టు ప్రకటించిన పాక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి సాజిద్ మునీర్‌ను జైలుశిక్ష అనంతరం విడుదల చేసిన భారత్, ఏడాది కాలంగా తిండిపెట్టడమే కాకుండా షెల్టర్ కూడా ఇచ్చింది.
గూఢచర్యం కేసులో మునీర్ 12 ఏళ్లపాటు భోపాల్‌లో జైలు శిక్ష అనుభవించాడు. అతడిని విడుదల చేసిన తర్వాత పాక్‌కు ఆ విషయాన్ని తెలియజేసింది. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో అతడి బాధ్యత భోపాల్ పోలీసులపై పడింది. దీంతో ఇప్పటికి పది నెలలుగా అతడి బాధ్యతలను భోపాల్ పోలీసులు, డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ (డీబీఎస్) చూసుకుంటున్నాయి. ఆహారం నుంచి అతడి అన్ని అవసరాలను తీరుస్తున్నాయి.
కాగా, మునీర్ ప్రస్తుతం తిరిగి సొంతదేశం పాకిస్థాన్ వెళ్లేందుకు భయపడుతున్నాడు. అక్కడ తనను చంపేయడం ఖాయమని చెబుతున్నాడు. తనకు భారతీయ న్యాయవ్యవస్థపై నమ్మకముందని మునీర్ పలుమార్లు చెప్పినట్టు ఎస్పీ రాజేశ్ భడోరియా పేర్కొన్నారు. కాగా, ఆర్మీ రెజిమెంట్ నుంచి రహస్య పత్రాలను సేకరిస్తున్న మునీర్‌ను మే 2004లో భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జూన్ 4న శిక్షా కాలం ముగియడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.