: ఓ మహిళను అలా అంటారా? ఆవులను కాపాడతారు గానీ మహిళలను కాపాడరా?: రాజ్యసభలో జయాబచ్చన్ ఫైర్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను నరికి తీసుకువచ్చిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత యోగేష్ చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంటులో విపక్ష సభ్యులు మండిపడ్డ విషయం తెలిసిందే. బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీకి మమతా బెనర్జీ సర్కారు ఆంక్షలు విధించడంతో ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఈ రోజు రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడుతూ ఓ మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటని ఆమె ప్రశ్నించారు.
అయితే, యోగేష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నప్పటికీ, జయాబచ్చన్ మాత్రం సంతృప్తి చెందలేదు. మహిళలను అటువంటి మాట అనడానికి ఆయనకు ఎంత ధైర్యం? అని వ్యాఖ్యానించారు. మహిళలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మాట్లాడుతూ... తాను కూడా ఓ మహిళనేనని అన్నారు. తనను గతంలో పోలీసుల ఎదురుగానే కొంతమంది కొట్టారని ఆమె చెప్పారు. ఆ ఘటనకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు.