: శోభా డే ట్వీట్ తో 'భారీ' పోలీస్ ఇప్పుడు సన్నబడ్డాడు.. త్వరలోనే విధుల్లోకి!


దౌలత్‌రామ్ జోగావత్.. ప్రముఖ రచయిత్రి శోభాడే ట్వీట్‌తో మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. హార్మోన్ల అసమతౌల్యత కారణంగా లావు పెరిగిన జోగావత్ ముంబైలో జరిగిన ఎన్నికల్లో బందోబస్తు నిర్వహించేందుకు వచ్చారు.  ఓ కుర్చీలో కూర్చున్న అతడిని చూసిన శోభాడే ‘భారీ బందోబస్త్’ పేరుతో చేసిన ట్వీట్ ఆమెకు విమర్శలు తెచ్చిపెట్టింది.

కాగా, శోభా డే ట్వీట్‌తో జోగావత్ గురించి తెలుసుకున్న ముంబైలోని సైఫీ ఆస్పత్రి అతడికి వైద్యం చేసేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు, అతడిని ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాగా ఇటీవల జోగవత్‌కు సైఫీ ఆస్పత్రి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ చేశారు. దీంతో ఒక్క నెలలోనే 15 కేజీలు తగ్గారు. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యులు చెప్పిన డైట్ పాటిస్తున్నానని, రోజుకు గంటకుపైగా నడుస్తున్నానని జోగావత్ తెలిపారు. అన్ని రకాలుగా కూడా తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు గురువారం ఆయన పేర్కొన్నారు.

జోగావత్‌కు ల్యాపరోస్కోపిక్ బ్రాండెడ్ బండెడ్ రౌక్స్ ఎన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా మాట్లాడుతూ జోగావత్ త్వరలోనే వంద కిలోలకు చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలల్లో జోగవాత్ మరో 15 కిలోలు తగ్గుతారని, ఏడాదిలో మొత్తంగా 80 కిలోలు తగ్గుతారని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. బాగా లావుతగ్గిన జోగావత్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News