: సెల్ టవర్ కారణంగా క్యాన్సర్ కు గురైన సామాన్యుడు.. వెంటనే టవర్ ను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
మొబైల్ టవర్ల కారణంగా మన ఆరోగ్యం ఎంతగా నాశనం అవుతుందన్న దానికి ఇదొక ఉదాహరణ. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో హరీష్ చంద్ తివారీ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇటీవల అతనికి క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో, బీఎస్ఎన్ఎల్ కు చెందిన ఓ టవర్ కారణంగానే తాను రేడియేషన్ కు గురయ్యానని, క్యాన్సర్ తో బాధపడుతున్నానంటూ హరీష్ చంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా, బీఎస్ఎన్ఎల్ పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడు వారాల్లోగా ఆ టవర్ ను డీయాక్టివేట్ చేయాలంటూ ఆదేశించింది.
తాను నివాసం ఉంటున్న ఇంటి పైభాగంలో బీఎస్ఎన్ఎల్ 2002లో అక్రమంగా టవర్ ను ఏర్పాటు చేసిందని తన పిటిషన్ లో హరీష్ చంద్ పేర్కొన్నాడు. గత 14 ఏళ్లుగా దాన్నుంచి విడుదల అవుతున్న రేడియేషన్ కారణంగా తాను క్యాన్సర్ బారిన పడ్డానని తెలిపాడు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఓ మొబైల్ టవర్ విషయంలో ఓ సామాన్యుడుకి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరించినట్టైంది. మరోవైపు, ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా మొబైల్ టవర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది.