: తన పెళ్లిని తానే ఆపేయించిన వధువు!
తమ వివాహం విషయంలో మునుపటిలా అమ్మాయిలు ఇప్పుడు లేరు. తమకు ఇష్టం వున్నా లేకపోయినా తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని ఒప్పుకుని, మూడు ముళ్ళూ వేయించుకునే స్థితిలో నేటి మహిళలు లేరు. మనస్ఫూర్తిగా నచ్చితేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. లేకపోతే తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తున్నారు. నేటి మహిళల్లో అంతగా చైతన్యం వచ్చింది. ఇందుకు తాజా నిదర్శనం కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే... మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కబీచనహళ్ళి గ్రామంలో ఓ దంపతులు అదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకునితో తమ కుమార్తె (17) వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని, మరో సంవత్సరం ఆగాలని బాలిక తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేసింది. అయితే 'చిన్నపిల్లవు.. చెప్పినట్టు విను' అంటూ తల్లిదండ్రులు ఆమెను వారించి, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు.
దీంతో ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని నిర్ణయించుకున్న సదరు బాలిక బంధువుల సహాయంతో శిశుసంక్షేమ అధికారుల ఫోన్ నెంబర్ సంపాదించి, వారికి ఫోన్ చేసి, విషయం వివరించింది. పెళ్లి ఆపాలని కోరింది. దీంతో అధికారులు వచ్చి, బాలిక తల్లిదండ్రులకు సర్ది చెప్పి వివాహం ఆపేయించారు. అంతే కాకుండా బాలికకు అండగా నిలబడి, వారిపై కేసు నమోదు చేయించారు.