: ఆవులను రక్షించేందుకు ప్లాస్టిక్ బ్యాగులను రద్దు చేయనున్న మధ్యప్రదేశ్
ఆవుల మరణాలకు పాలిథిన్ క్యారీ బ్యాగులు కారణమవుతున్నాయన్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాటిని నిషేధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మే 1 నుంచే వీటిపై నిషేధం విధించాలని యోచిస్తోంది. అయితే ఎంత మందంలో ఉంటే పాలిథిన్ క్యారీ బ్యాగులను అనుమతిస్తామన్న విషయాన్ని ప్రభుత్వం పేర్కొనలేదు. దీంతో క్యారీ బ్యాగుల తయారీదారుల్లో ఆందోళన నెలకొంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ జనవరిలోనే పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించింది. పశువుల మరణాల్లో అధికశాతం క్యారీబ్యాగుల వల్లే సంభవిస్తున్నాయని, కాబట్టి వాటిని రాష్ట్రవ్యాప్తంగా నిషేధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ప్రజా సంబంధాల మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.