: మంచి నీళ్లు తాగేసి.. ఆ వాటర్ బాటిల్ ను హ్యాపీగా తినేయచ్చు!
ప్లాస్టిక్ అనేది మన జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది, పర్యావరణాన్ని నాశనం చేస్తోంది, భూమిని కలుషితం చేస్తోందని ఎంత చెప్పినా వినిపించుకునేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఇక చెప్పి లాభం లేదని భావించిన కొందరు విద్యార్థులు అసలు వాటర్ బాటిల్ అన్నదే భూమి మీద లేకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. దాని ఫలితంగా వినూత్న ఆవిష్కరణకు నాందిపలికారు. బ్రిటన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ఇంపీరియల్ కాలేజ్ పరిశోధక విద్యార్థులు బయోడీగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ కు రూపకల్పన చేశారు.
విశేషం ఏమిటంటే, ఈ బాటిల్స్ ను నీళ్లు తాగాక హ్యాపీగా తినేయవచ్చు. ఒకవేళ తినడం ఇష్టం లేకపోతే బయట పారవేసినా పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. గాలిబుడగలా ఉండే ఈ బాటిల్స్ ను కావాల్సిన రుచులతో తయారు చేసుకోవచ్చని ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థి రోడ్రిగో గార్సియా గొంజాలెస్ తెలిపారు. ఈ బయోడీగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ ను ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ కంటే చవకగా తయారు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చేస్తుందని, ప్లాస్టిక్ బాటిల్స్ ఇకపై కనుమరుగు కావాల్సిందేనని ఈ పరిశోధనపై గ్లోబల్ డిజైన్ ఫోరమ్ ప్రశంసలు కురిపించింది.