: ‘మెగా’ కుటుంబం అంతా కలిస్తే సినిమాల గురించి తక్కువగా మాట్లాడుకుంటాం: వరుణ్ తేజ్
దర్శకుడు శ్రీను వైట్ల పడే కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయానని, అందుకే ఆయన కన్నా ఎక్కువగా కష్టపడాలని ‘మిస్టర్’ సెట్ లో ఉండగా అనుకున్నానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. ఈ నెల 14న ‘మిస్టర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఒక ప్రయాణానికి సంబంధించిన కథ ఇది అని, ఈ సినిమాలో హీరో పేరు తెలియక చాలా మంది ‘మిస్టర్’ అని పిలుస్తుంటారని, అదే టైటిల్ ఈ కథకు సరిపోయిందని అన్నాడు. ఈ సందర్భంగా తమ కుటుంబం గురించి వరుణ్ ప్రస్తావిస్తూ, రామ్ చరణ్ తో తాను చాలా సన్నిహితంగా ఉంటానని, ‘మెగా’ కుటుంబ హీరోలందరూ షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల తామందరం కలిసి చాలా రోజులైందన్నాడు. తమ కుటుంబ సభ్యులందరూ కలిస్తే సినిమాల గురించిన ప్రస్తావన తక్కువగా ఉంటుందని వరుణ్ తేజ్ చెప్పాడు.