: భంగపడిన బెంగళూరు.. అక్కరకు రాకుండా పోయిన డివిలియర్స్ విధ్వంసం.. ‘కింగ్స్‌’కు రెండో విజయం


పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా మెరుపు బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 149 పరుగుల విజయ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసి అలవోక విజయం సాధించింది. ఆమ్లా (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు, నాటౌట్), కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు, నాటౌట్) చెలరేగి ఆడడంతో మరో 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు తొలి నుంచి పరుగుల వేటలో వెనకబడింది. తొలి ఓవర్లోనే వాట్సన్ పెవిలియన్ చేరాడు. క్రిస్‌గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన డివిలియర్స్ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు.  46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 89 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. అయితే డివిలియర్స్ విధ్వంసం జట్టు విజయానికి దోహదపడలేకపోయింది. బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరే వెనుదిరుగుతుండడంతో నిర్ణీత 20 ఓవర్లలో 148 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. పరుగులు ఇవ్వడంలో పిసినారితనం ప్రదర్శించిన పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  

  • Loading...

More Telugu News