: యాసిడ్ అమ్మకాలు, నిల్వ విధానాలను కఠినతరం చేసిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పర్చిన సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో యాసిడ్ అమ్మకాలు, నిల్వ విధానాలను కఠినతరం చేసింది. యాసిడ్ దాడులు అధికమవుతున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం... యాసిడ్ విక్రయించే వ్యాపారులు తమ దగ్గరున్న స్టాక్ వివరాలను ప్రతి 15 రోజులకొకసారి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)లకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో వ్యాపారులు తప్పుడు వివరాలు చెబితే వారి వద్దనుంచి మొత్తం స్టాక్‌ను సీజ్ చేస్తారు. అంతేగాక 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ప్రతి నెలా ఏడో రోజు కలెక్టర్లు యాసిడ్ విక్రయ దుకాణాలను పరిశీలిస్తారు. అలాగే, యాసిడ్ కొనుగోలు చేసిన వారి పేరు, చిరునామాలను కూడా దుకాణదారులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.