: రైల్లో గర్భిణి సుఖ ప్రసవానికి సాయపడ్డ వాట్సప్ మెసేజ్ లు
రైల్లో ప్రయాణిస్తోన్న ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో వాట్సప్ సాయంతో ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆమెకు కాన్పు చేసిన ఘటన నాగపూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రైలులో చోటు చేసుకుంది. అహ్మదాబాద్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోన్న చిత్రలేఖ (24) అనే గర్భిణికి నొప్పులు రావడంతో ఆమె బంధువులు ట్రైన్ చైన్ లాగి రైలును ఆపారు. వారు ఉన్న బోగీ వద్దకు టికెట్ కలెక్టర్‌తో పాటు రైలు సిబ్బంది వచ్చి, ఏం చేయాలో తెలియక డాక్టర్ కోసం వెతుకుతున్న సమయంలో అక్కడే ఉన్న ఫైనలియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ విపిన్ ఖడ్సే ఆమెకు వైద్యం చేస్తానని అన్నాడు.
అయితే, ప్రసవ సమయంలో శిశువు తల ముందు బయటకు రాకుండా భుజం భాగం ముందు బయటకు వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియని ఖడ్సే వాట్సప్ గ్రూప్ ద్వారా ఆ ఫోటోలను తన సీనియర్లకు పంపించి వారి నుంచి సూచనలు తీసుకున్నాడు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నాగపూర్ స్టేషన్లో ఆమెను దించిన ఆమె బంధువులు ఆమెను రైల్వే ఆస్పత్రికి తరలించారు.