: ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు బాలకృష్ణకు తెలుసు: పురందేశ్వరి
తమ తండ్రి ఎన్టీఆర్ కు సంబంధించిన అన్ని విషయాలు తన సోదరుడు బాలకృష్ణకు తెలుసని బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ పై బాలకృష్ణ తీయనున్న చిత్రం గురించి ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ, ‘ఈ సినిమా కథకు సంబంధించిన చర్చల్లో పాల్గొనమని కోరితే నేను పాల్గొంటాను. ఈ విషయమై ఇంత వరకూ ఎటువంటి చర్చ జరగలేదు. ఈ సినిమా కథ ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఫినిష్ చేయాలని తమ్ముడు అంటున్నాడు. అలా కాదు, కథకు సంబంధించి చర్చలకు రమ్మని పిలిస్తే వెళతాను. చరిత్రను ఎవరూ వక్రీకరించ లేరు. ఎన్టీఆర్ పై తీసే సినిమాలో కచ్చితంగా వైస్రాయ్ హోటల్ సంఘటన ఉండాలి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
‘తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి మీరు వేరే పార్టీలో చేరారంటూ మీ పాత్రను ఈ సినిమాలో ఒక వేళ చిత్రీకరిస్తే..’ అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ‘ఎన్టీఆర్ ఆశయాలకు నేను తూట్లు పొడవలేదు’ అని అన్నారు. ఎన్టీఆర్ అనేది ఓ చరిత్ర, ఆ చరిత్ర గురించి ఎవరూ వక్రీకరించలేరని పురందేశ్వరి అన్నారు.