: ఇండియన్ నేవీకి థ్యాంక్స్ చెప్పిన చైనీస్ నేవీ!
అవును.. ఇండియన్ నేవీకి చైనీస్ నేవీ కృతజ్ఞతలు చెప్పింది. గల్ఫ్ ఆఫ్ అదెన్‌లో సముద్రపు దొంగలు ఓ కార్గో షిప్ చోరీకి ప్రయత్నించారు. మలేషియా, పోర్ట్ ఆఫ్ అదెన్ మధ్య 21 వేల టన్నుల ఆ కార్గో షిప్ ప్రయాణిస్తున్న సమయంలో పైరేట్స్ ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ విషయాన్ని గుర్తించిన యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అలెర్ట్ పంపించడంతో భారత యుద్ధనౌకలయిన ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తర్కాష్ వెంటనే స్పందించి రంగంలోకి దిగాయి. ఆ షిప్‌ను పరిశీలించడానికి ఓ హెలికాఫ్టర్‌ను కూడా పంపించి, ఆ లూటీకి గురవుతున్న షిప్ కెప్టెన్‌తో భారత అధికారులు మాట్లాడారు. అనంతరం మరోవైపు చైనీస్, ఇటాలియన్, పాకిస్థాన్ నేవీలు కూడా ఈ విషయంపై స్పందించాయి.
పైరేట్స్ దాడి చేయడంతో ఆ షిప్‌లోని కెప్టెన్‌తోపాటు ఇతర నౌకా సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లిపోయి, అక్కడే దాక్కుని తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు నుంచి చైనా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి ఆ నౌకలోకి వెళ్లాయి. దీంతో పైరేట్స్ వెంటనే పారిపోయారు. షిప్‌లోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో యాంటీ పైరసీ మిషన్‌లో పాలుపంచుకున్న భారత నేవీకి చైనా నేవీ అధికారులు థ్యాంక్స్ చెప్పారు. 2011 నుంచి సముద్ర దొంగల దాడి పెరిగిపోతోంది.