: జగన్‌ను విజయ్ మాల్యాతో పోల్చి రాక్షసానందం పొందుతున్నారు: చంద్రబాబుపై అంబటి విమర్శలు
తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విజయ్ మాల్యాతో పోల్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందుతున్నారని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నంలో చంద్రబాబు మాట్లాడిన తీరు సిగ్గుచేటని అన్నారు. జగన్ ఏ నేరం చేయకపోయినా ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. కేవలం ఆరోపణలు వస్తే నేరం చేసినట్టా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చేస్తోన్న ఈ చర్యలను ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్నందుకు టీడీపీ నేతలు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన సవాలు విసిరారు. ఎదుటివారిపై బురద చల్లుతూ తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన అన్నారు.