: జగన్ కు తెలియదనుకుంటున్నారా?.. వాడికి అన్నీ తెలుసు: జేసీ
పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏం ప్రయోజనమని... రాష్ట్రపతి ఏం చేస్తారని ప్రశ్నించారు. దీని గురించి ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు. అన్నీ తెలిసిన పేర్లే అంటూ... ఊరికే వాళ్ల దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే ఏం ప్రయోజనమని ఎద్దేవా చేశారు.
మనం దేవుడి దగ్గరకు ఎందుకెళ్తాం... ఆపద్బాంధవా కాపాడు తండ్రీ అని మొక్కోవడానికి వెళ్తామని జేసీ అన్నారు. జగన్ కూడా అంతేనని... తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి కాపాడాలని కోరుకోవడానికే ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. జగన్ కు ఏమీ తెలియదని అనుకుంటున్నారా... వాడికి అన్నీ తెలుసని, కేసుల నుంచి తప్పించండని అడుక్కోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. అనంతపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.