: పనికిమాలిన వారికి, వానపాములకు మంత్రి పదవులు ఇచ్చారు: రోజా
రాజీనామాలు కూడా చేయకుండా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిన వారికి, వానపాములకు మంత్రి పదవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం కేటాయించారు కానీ, తుందుర్రుకు విచ్చేసి, ఇక్కడి బాధితుల కష్టాలను వినేందుకు మాత్రం సమయం కేటాయించలేకపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తుందుర్రులోని ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నరసాపురం వైసీపీ నేత ప్రసాదరాజు నిరాహారదీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసి, ఆయనకు సంఘీభావం ప్రకటించారు రోజా.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలకు ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి భారీగా ముడుపులు ముట్టాయని రోజా ఆరోపించారు. ఈ కారణం వల్లే చంద్రబాబు ఇక్కడకు రావడం లేదని అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడకుండా చేశారని విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.