: సరిహద్దులు దాటి వెళ్లి, బరంపురం రాజకీయ నేత కొడుకును అరెస్ట్ చేసి పట్టుకొచ్చిన ఏపీ పోలీసులు!


ఓ హత్య కేసులో భాగంగా, నిందితుడిని తీసుకువచ్చేందుకు ఆంధ్రా పోలీసులు రహస్యంగా సరిహద్దులు దాటారు. ఒడిశాలోని బరంపురం మునిసిపల్ కార్పొరేషన్ 36వ వార్డు కార్పొరేటర్ సీహెచ్ గంగాధర్ పాత్రో ఇంటిపై దాడి చేసి, ఆయన కుమారుడు అనమ్ పాత్రోను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను గంగాధర్ అడ్డుకోవడంతో, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. ఈ విషయంలో తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని బరంపురం ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్ వెల్లడించడం గమనార్హం.

కాగా, గత సంవత్సరం ఆగస్టు 25న రామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఆపై విచారణలో భాగంగా, ఆమె ఛత్రాపూర్ నివాసి వివేకానంద పండా కుమార్తె తృప్తిమయి అని, ఆమె కళ్లికోట్ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతోందని గుర్తించారు. బరంపురం పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదు కాగా, సోంపేట పీఎస్ లో హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సంయుక్తంగా దర్యాఫ్తు జరిపిన ఒడిశా, ఆంధ్రా పోలీసులు అందులో భాగంగానే అనమ్ పాత్రోతో పాటు కారు డ్రైవర్ కన్ను బాహ్మను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిని శ్రీకాకుళం జిల్లా బారువ పోలీసు స్టేషన్ లో ఉంచినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం వెల్లడికావాల్సి వుంది.

  • Loading...

More Telugu News