: బీజేపీ అనూహ్య నిర్ణయం.. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు.. పరిశీలనలో కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లట్‌ పేరు!


రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి థావర్‌చంద్ గెహ్లట్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈనెల 14న ప్రధాని నరేంద్రమోదీ నాగ్‌పూర్‌లో పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగ్‌పూర్‌లోని దీక్షభూమిలో అంబేద్కర్‌కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశంలో దళిత వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లట్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన గెహ్లట్‌కు ఆరెస్సెస్‌తో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. మరోవైపు మోహన్ భగవత్‌తో భేటీకి ముందే ఈనెల 10న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఎన్డీయే అగ్రనేతలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్రమంత్రి మండలిలో మార్పుచేర్పులపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News