: ఎందరు కేసీఆర్‌లు, కేటీఆర్‌లు వచ్చినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరు!: నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క


కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు ఎందరు వచ్చినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పసిగుడ్డు కాబట్టే కళ్లు మూసుకుని పాలిస్తోందని, ఒకసారి కళ్లు తెరిచి చూస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు.

 తెలంగాణలో అన్ని వర్గాలు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయనీ, మూడేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రజల కోసం ఒరగబెట్టిందేమిటో చెప్పాలన్నారు. ప్రాజెక్టులు కడతామని మూడేళ్లుగా మాయమాటలు చెబుతున్నారే తప్ప, ఒక్కటి కూడా కట్టలేదన్నారు. ప్రాజెక్టులు కట్టడం చేతకాక తిరిగి కాంగ్రెస్ అడ్డుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పార్టీలోని అంతర్గత పోరును కప్పిపుచ్చుకునేందుకే ఇతరులపై దుష్ప్రచారానికి దిగుతున్నారన్నారు. భద్రాచల శ్రీరాముని కల్యాణానికి సంప్రదాయానికి విరుద్ధంగా మనవడితో తలంబ్రాలు పంపడం ఎంతవరకు సమంజసమో కేసీఆర్ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News