: ఈ జాతీయ అవార్డును నా ప్రియమైన భార్యామణికి అంకితమిస్తున్నా: హీరో అక్షయ్ కుమార్
ఈ రోజు ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం సినిమాకి)కి అవార్డు లభించిన విషయం తెలిసిందే. తనకు అవార్డు రావడం పట్ల అక్షయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. అవార్డు లభించిందన్న వార్త చాలా గొప్పదని ఆయన అన్నాడు. దేశంలోని అత్యుత్తమ పురస్కారాల్లో జాతీయ ఫిలిం అవార్డులు చాలా ప్రతిష్ఠాత్మకమైనవని ఆయన వ్యాఖ్యానించాడు. తనకు అవార్డు వచ్చిందన్న వార్తను మొదటిసారిగా విన్నప్పుడు మొదట ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకొన్నానని అన్నాడు.
ఇప్పుడు తాను ఆనందంలో మునిగి తేలుతున్నానని, కష్టానికి ప్రతిఫలమే అవార్డు అని ఆయన అభివర్ణించాడు. 2016 సంవత్సరం తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందని అన్నాడు. ఈ అవార్డు వచ్చిన స్ఫూర్తితో మరింత బాగా రాణిస్తానని చెప్పాడు. తాను ఎన్నో ఏళ్లుగా మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, అయితే, గొప్పవి అనుకున్న కొన్ని చిత్రాలు గుర్తింపునకు నోచుకోకపోవడంపై కొంత బాధపడ్డానని చెప్పాడు. తనకు వచ్చిన ఈ అవార్డు లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఈ అవార్డును తన కుటుంబ సభ్యులకు ప్రధానంగా తన ప్రియమైన భార్యామణికి అంకితమిస్తున్నానని అన్నాడు.