: ‘నన్ను క్షమించండి నాన్నా’ అంటూ వాట్సప్‌లో వీడియో.. ఆపై ఆత్మహత్య
‘నన్ను క్షమించండి నాన్నా’ అంటూ ఓ వ్యక్తి తన తండ్రికి వాట్సప్‌లో వీడియో పంపించి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్న ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపూర్ లో చోటుచేసుకుంది. అయితే, ఆ మెసేజ్‌ను ఆ వ్యక్తి తండ్రి ఆలస్యంగా చూసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)లో డ్రైవర్ గా పనిచేస్తోన్న 36 ఏళ్ల సంజయ్ వర్మ ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రి మోహర్ సింగ్ ఫోన్ కు మెసేజ్ చేశాడు. అనంతరం మరో మెసేజ్ చేస్తూ.. మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుని చెక్ చేసుకోండి అని పంపాడు.
తన కొడుకు చెప్పినట్లుగానే వాట్సప్ ఇన్ స్టాల్ చేసుకున్న తండ్రి ఆ తరువాత నిద్రపోయాడు. అయితే, కొద్ది సేపటికి వాట్సప్ చూసుకుంటే అందులో తన కుమారుడు పంపిన వీడియో ఉంది. ఆ వీడియోలో సంజయ్ వర్మ తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనను క్షమించాలని తండ్రితో చెప్పాడు. తన పిల్లలకు 14, 9 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. కొందరు సన్నిహితులే తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని చెప్పాడు. ఈ వీడియోని ఎప్పటికీ భద్రపరుచుకోవాలని చెప్పాడు. ఆ వీడియో చూసిన తండ్రి, కుటుంబసభ్యులు షాక్ నుంచి తేరుకొని తన కుమారుడి వద్దకు వెళ్లి చూసేలోగా ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.