: ఐపీఎల్-10లో పుణె శుభారంభం.. ముంబైపై ఉత్కంఠ విజయం
ఐపీఎల్-10 సీజన్‌ను రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు అద్భుతంగా ఆరంభించింది. ఆరంభ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం సాధించింది. కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెరుపులతో పదో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. గురువారం పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ పథంలో నడిపాడు.
అజింక్యా రహానె (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) మెరుపులు మెరిపించడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35.. నాటౌట్), నితీష్ (34) రాణించడంతో ముంబై 184 పరుగులు చేయగలిగింది. పుణె బౌలర్లలో తాహిర్ 3, రజిత భాటియా 2 వికెట్లు తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ లభించింది.