: ప్రేయసి ఇంటి పెరట్లో ప్రియుడి మృతదేహం.. యువతి కుటుంబ సభ్యుల అరెస్టు!


ప్రియురాలి ఇంటి పెర‌ట్లో ప్రియుడి మృత‌దేహం ల‌భ్య‌మైన ఘ‌ట‌న హర్యానాలో క‌ల‌క‌లం రేపింది. సోనిపాట్ జిల్లా భుటానా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. వివ‌రాల్లోకి వెళితే... పాఠశాల చదువును మధ్యలోనే ఆపేసిన అమిత్‌సింగ్ (22) అనే యువ‌కుడు త‌మ గ్రామంలోని కరమ్‌బీర్ సింగ్ అనే వ్య‌క్తి పెద్దకుతూరు సోనియా(20)ను ప్రేమించాడు. వీరిద్ద‌రి మ‌న‌సులు క‌లవ‌డంతో ఒక‌రిని విడిచి ఒకరు ఉండ‌లేని స్థితికి వ‌చ్చారు. అంతేగాక‌ ఇద్ద‌రు యువ‌తీయువ‌కులు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడా.

అయితే, త‌మ కూతురి ప్రేమ వ్య‌వ‌హారం గురించి తెలుసుకున్న క‌ర‌మ్ బీర్ సింగ్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆమెపై కోపం పెంచుకున్నారు. చివ‌ర‌కు ఆ ప్రేమికులు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండలేక ఎక్క‌డికైనా దూరంగా పారిపోయి హాయిగా జీవించాల‌ని అనుకున్నారు. అయితే, నిన్న ఆ యువతి తండ్రి, సోదరుడు ఇద్దరూ అమిత్ ఇంటికి వచ్చి బలవంతంగా అతనిని తీసుకువెళ్లారు. నిన్న‌ సాయంత్రం వ‌ర‌కు త‌మ కొడుకు వ‌స్తాడ‌ని ఎదురుచూసిన అమిత్ త‌ల్లిదండ్రులు.. చీక‌పడినా అతను ఎంతకీ రాక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందారు.

దీంతో త‌మ కుమారుడిని తీసుకెళ్లిన‌ కరమ్‌బీర్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అయితే, వారిపై అనుమానం తెచ్చుకున్న అమిత్ కుటుంబ స‌భ్యులు అక్క‌డ ఉన్న పెర‌టిని ప‌రిశీలించ‌గా అక్కడ అమిత్ మృత‌దేహం క‌నిపించింది.  మృతదేహంపై 30 గాయాలు ఉన్నాయ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో యువతి తండ్రి కరమ్‌బీర్ సింగ్‌తో పాటు, ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులు, సోదరుడిపై కేసు న‌మోదు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News