: అలాంటి లక్షణాలన్నీ మణిరత్నం సొంతం!: అదితిరావ్ హైదరి
ప్రముఖ దర్శకుడు మణిరత్నం లాంటి వ్యక్తులు మనకు ఊహాలోకంలోనే ఎక్కువగా కనిపిస్తారని అదితిరావ్ హైదరి తెలిపింది. సెట్ లో ప్రతి ఒక్కరినీ సమానంగా చూడడం... తనకు ఏం కావాలో దానిని ఎవరినీ నొప్పించకుండా రాబట్టుకోవడం, ఓపిగ్గా ఉండడం... తాను దిగ్గజం అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా కొత్తవారిని కూడా ఆదరంగా చూడడం.. వంటి లక్షణాలు ఆయనకే సొంతమని చెప్పింది.
'చెలియా' సినిమా ప్రమోషన్ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ, మణిరత్నం సర్ తనకు కొంచెం ఎక్కువ స్వేచ్ఛనిచ్చారని అన్నాడు. కొన్ని షాట్లు తీసేటప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగితే...'అదే బాగుంది, అలాగే చెయ్' అని ఆయన ప్రోత్సహించారని తెలిపాడు. అలాగే క్లైమాక్స్ సీన్ తీసిన తరువాత అందరూ నవ్వుతూ హాయిగా అభినందించారని, అది అద్భుతమైన సన్నివేశమని అన్నాడు. చైనా సరిహద్దుల్లో పగలు కేవలం 6 గంటలపాటు మాత్రమే లైటింగ్ ఉండే ప్రాంతంలో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరిగిందని, కఠినమైన వాతావరణంలో షూటింగ్ చేయడం ఒక ఎత్తయితే... షాట్లు అనుకున్నట్టు రావడం మరో ఎత్తని కార్తీ తెలిపాడు. సెర్బియాలో కూడా కఠిన వాతావరణంలో షూటింగ్ జరిగిందని, అది కూడా మర్చిపోలేని అనుభవమని కార్తీ తెలిపాడు.