: రోడ్డు పక్కన బస్సు ఆపి సాయం చేసి వచ్చిన డ్రైవర్!
స్కాట్‌లాండ్‌లో ఓ బస్సు డ్రైవర్ చేసిన పని గురించి తెలుసుకుంటున్న నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తూ జేజేలు కొడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి సాయం చేసేందుకే మనిషి ముందుకు రాకుండా ప్రవర్తిస్తోన్న ఈ రోజుల్లో, ఆ డ్రైవర్ చేసిన పని అందరినీ ఆకర్షిస్తోంది. స్కాట్‌లాండ్‌కి చెందిన జాకీ డౌనీ అనే బస్సు డ్రైవర్ తన విధిని నిర్వర్తిస్తోన్న సమయంలో... ఆయనకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడు కనిపించాడు. చేతికర్ర పట్టుకుని నిదానంగా నడుచుకుంటూ వెళుతున్న ఆ వృద్ధుడు తన బూట్లకు లేసులు కట్టుకోలేదు. వెంటనే తన బస్సుని ఆపిన జాకీ బస్సు దిగి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి బూట్లకు లేసులు కట్టి తిరిగి బస్సులోకి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆ బస్సులోని ప్రయాణికులు జాకీని ప్రశంసించారు. కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో ఆయనను ఎంతో మంది నెటిజన్లు అభినందిస్తున్నారు.