: అశోక్ గజపతిరాజుపై లోక్ సభలో శివసేన ఎంపీల దురుసు ప్రవర్తన.. మంత్రికి మద్దతుగా నిలిచిన టీడీపీ ఎంపీలు!
ఎయిరిండియా సిబ్బందిని తాను కొట్టిన అంశంపై ఎంపీ గైక్వాడ్ ఈ రోజు లోక్‌సభలో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై ఈ రోజు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత అంశంలో రాజీ పడే ప్రసక్తేలేదని అన్నారు. గైక్వాడ్- ఎయిర్ ఇండియా వివాదంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.
అయితే, ఆ వెంటనే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అశోక్ గజపతిరాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను చుట్టుముట్టి పలు వాదనలు వినిపించారు. శివసేన ఎంపీల దురుసు ప్రవర్తనపై ఎన్డీఏ సభ్యులు కూడా ప్రతిస్పందించారు. శివసేన ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి అనంత్ గీతె కూడా దురుసుగా ప్రవర్తించారు. అయితే, అనంత్ గీతెను స్మృతి ఇరానీ, అహ్లూవాలియా బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో అశోక్ గజపతి రాజుకు మద్దుతుగా టీడీపీ ఎంపీలు వెళ్లారు. వివాదం ముదరకుండా అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ ఆయనను బయటకు తీసుకెళ్లారు.