: రూ. 50 సుదర్శనం టికెట్లు పూర్తి రద్దు... టీటీడీ సంచలన నిర్ణయం!
ఎన్నో సంవత్సరాలుగా మధ్య తరగతి ప్రజలు మరింత వేగంగా వెంకటేశ్వరుని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్న రూ. 50 సుదర్శనం టికెట్లను పూర్తిగా రద్దు చేస్తూ, టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రమణాచారి పనిచేస్తున్న సమయంలో ఈ టికెట్లను అందుబాటులోకి తేగా, తొలుత 50 శాతం టికెట్లను సుదర్శనం కోటాలో విక్రయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుదర్శనం కోసం వచ్చే భక్తుల కోసమే 8 కంపార్టుమెంట్లను కేటాయించారు కూడా. ఆపై ఈఓగా బాధ్యతలను కృష్ణారావు స్వీకరించిన తరువాత రూ. 300 దర్శనం టికెట్లను ప్రవేశపెట్టి, సుదర్శనం కోటాను తగ్గించారు. ఈ టికెట్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ ఉండటంతో దశలవారీగా సుదర్శనం టికెట్లు తగ్గుతూ వచ్చాయి.
ఆ తరువాత ఎంజీ గోపాల్ ఈఓగా పని చేసిన సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయం ఆన్ లైన్ ద్వారా ప్రారంభమైంది. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతతో టికెట్ల బుకింగ్ సులువుగా మారడంతో, ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లోనే టికెట్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో రూ. 50 సుదర్శనం టికెట్ల సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది. ఆపై కొంతకాలం పాటు వారంలో మూడు రోజులు మాత్రమే సుదర్శనం టికెట్లను జారీ చేసిన టీటీడీ, ఇప్పుడు వాటిని పూర్తిగా రద్దు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, గత ఐదు రోజులుగా ఈ టికెట్లను అందుబాటులో ఉంచలేదు. అనుకోకుండా తిరుపతికి వెళ్లే వెంకన్న భక్తులకు, ఇంతవరకూ సులువుగా దర్శనభాగ్యాన్ని కల్పించిన రూ. 50 టికెట్ల విక్రయాన్ని పూర్తిగా నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.