: దినపత్రికల్లో వార్తలపై ఇంత రభస ఏంటి?: రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం
రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంతంలో గోవులను తరలిస్తున్న ముస్లిం వ్యక్తులపై గో సంరక్షకులు చేసిన దాడి అంశం నేడు రాజ్యసభను కుదిపేసింది. గోసంరక్షకులు దాడులు చేశారని పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటాన్ని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని గులాంనబీ ఆజాద్, ఈ దాడుల వెనుక ప్రభుత్వ అండదండలున్నాయని మిస్త్రీ తదితరులు విమర్శలు గుప్పించారు.
దీనిపై సభలో ప్రకటన చేస్తామని బీజేపీ వెల్లడించగా, వెంటనే స్పందించాలని పట్టుబడుతూ, విపక్షాలు నిరసనను కొనసాగిస్తుండటంతో, కురియన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రభస చేయడమేంటని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తరువాతనే తాను స్పందిస్తానని వ్యాఖ్యానించారు. సభను వాయిదా వేయించడమే విపక్షం లక్ష్యంగా ఉన్నట్టు తనకు అనిపిస్తోందని, ఈ తరహాలో హైజాక్ కూడదని అన్నారు. ఆ సమయంలోనూ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోకుండా లేచి నిలబడి నినాదాలు చేస్తుండటంతో, కురియన్ లేచి నిలబడి, సభ్యులు సహకరించాలని, ఏ సమస్య అయినా చర్చకు అనుమతించేందుకు తాను సిద్ధమని అన్నారు. అయితే, పత్రికలు, చానల్స్ లో వచ్చిన వార్తల ఆధారంగా మాత్రం చర్చించేందుకు ఒప్పుకోబోనని కాస్తంత గట్టిగానే చెప్పారు.