: ఇక నేనూ హద్దులు దాటుతా: ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సిరియాలో పోరాటం హద్దులు మీరిందని, ఐరాస సంకీర్ణ దళాలు కలసిరాకపోయినా, అమెరికా సైన్యాన్ని పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రసాయనదాడి తనను కలచివేసిందని, ఎంతో మంది అమాయక చిన్నారులు బలికావడం బాధాకరమని అన్నారు. ఎన్నో హద్దులను దాటేశారని, ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
"ఉగ్రవాదుల ఏరివేత ఇక నా బాధ్యత. మంగళవారం నాటి దాడితో నా మనసు మారిపోయింది. ఇక ఇస్లామిక్ స్టేట్ ను ఓడించడంపై ప్రత్యేక దృష్టిని సారిస్తా" అంటూ జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలసి రోజ్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. చిన్నారులపై దాడి తనపై పెను ప్రభావాన్ని చూపిందని, ఇంతకన్నా ఘోరమైన దుర్ఘటనను తానింతవరకూ చూడలేదని ఆయన అన్నారు. సిరియాలో శాంతిని నెలకొల్పడంలో ఐరాస పదేపదే విఫలమవుతోందని, బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు.