: బ్యాంకు దొంగలకు ముచ్చెమటలు పట్టించిన మహిళలు!
కత్తి, తుపాకులను పట్టుకుని చొరబడిన దొంగలను చూస్తే సాధారణంగా మహిళలు కేకలు వేస్తారు. భయంతో వణికిపోతూ వంటిపై ఉన్న నగలు, తమ వద్ద ఉన్న డబ్బులను ఇచ్చేస్తారు. కానీ హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగినులు మాత్రం అలా చేయలేదు. దొంగలకే ముచ్చెమటలు పట్టించారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తమ బ్యాంకును దోచుకోడానికి కత్తి, తుపాకులతో ప్రవేశించిన ఇద్దరు దొంగలను ఆ మహిళలు చితక్కొట్టారు. అనంతరం స్థానికులు కూడా వచ్చి దొంగలను మరింత కొట్టారు. మొదట ఆ బ్యాంకులోకి ప్రవేశించిన ఇద్దరిలో ఒక దొంగ ఏదో ఫారం నింపుతున్నట్లు నటించి కుర్చీలో కూర్చున్నాడు. తరువాత వెనకాల బ్యాగ్ తగిలించుకుని రెండో వ్యక్తి వచ్చాడు.
ఆ బ్యాగ్‌లోంచి కత్తిని, రివాల్వర్‌ను తీసుకొని బ్యాంకు ఉద్యోగినుల వద్దకు వచ్చి వారిపై దాడి చేస్తూ, డబ్బును లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఉద్యోగినులు వారికి ఎదురు తిరిగారు. బ్యాంకు నుంచి బయటకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా దొంగలకు అడ్డంగా తలుపులు వేసి వారిని కొట్టారు. బయట ఉన్న స్థానికులు కూడా లోపలికి వచ్చి దొంగలను చావబాది పోలీసులకు సమాచారం అందించారు.