: వేసవిలో పంటను కాపాడుకునేందుకు.. దానిమ్మ తోటలో ప్రతి చెట్టుకు ఓ చీర కప్పిన రైతు!


అధిక ఉష్ణోగ్రతల నుంచి దానిమ్మ పంటను కాపాడుకునేందుకు కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కొత్త పద్ధతిలో ముందుకు వెళ్లాడు. తనకు చెందిన దానిమ్మ తోట లోని ప్రతి చెట్టుకు ఓ చీర కట్టడమే కాకుండా, ప్రతి కాయకు ఓ పేపర్ ను చుట్టి ఎండ వేడి నుంచి పంటను కాపాడుకుంటున్నాడు. ఈ సందర్భంగా పెద్ద టేకూరుకు చెందిన రైతు మహేశ్వరరెడ్డి ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ఎండల నుంచి పంటను కాపాడుకోవడం కోసమే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని, మొత్తం నలభై ఎకరాల్లో ఇరవై ఎకరాలలోని దానిమ్మ చెట్లను చీరలతో కప్పామని, ఈ విధంగా చేయకపోతే కనుక పంట అంతా దెబ్బతింటుందని, కాయలు పాడైపోతాయని అన్నారు.

గతంలో జరిగిన అనుభవం నేపథ్యంలో పంట పాడవకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నానని చెప్పారు. ఒక ఎకరాకు చీరలు కప్పేందుకు, కట్టేందుకు పురికొసలు, లేబర్ ఖర్చు మొదలైన వాటికి అయ్యే ఖర్చు సుమారు రూ.10 వేల వరకు అవుతుందని అన్నారు. అయితే, మిగిలిన 20 ఎకరాలకు పేపర్ కట్టానని అన్నారు. ఇందు కోసం పేపర్, లేబర్ ఖర్చులు కలిపి ఒక ఎకరాకు రూ.8 వేలు వరకు అవుతుందని చెప్పారు. పేపర్ కంటే చీరలు కప్పడమే మేలని.. అన్ని ఎకరాలకు చీరలు కప్పడం కుదరదు కాబట్టి కొన్ని ఎకరాలకు పేపరు కప్పామని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల అధిక వేడి వల్ల పంటలకు సోకే వ్యాధుల నుంచి దానిమ్మ పంటను కాపాడుకుంటాననే నమ్మకం తనకు ఉందని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News