: సత్యం బాబు నిందితుడు ఎలాగంటే...!: ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రంగనాథ్
ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా జైలు నుంచి బయటకు వచ్చిన సత్యం బాబు ఆ కేసులో ఎలా నిందితుడంటే... అంటూ సత్యం బాబు కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంగనాథ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ, నందిగామలో చిన్న చిన్న హాస్టల్స్ చాలా ఉన్నాయన్నారు. అక్కడి హాస్టళ్లలో చిన్నచిన్న వస్తువులు పోవడం, మహిళలల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయేషా మీరా హత్య జరిగిన అనంతరం ఇలాంటి చిన్న నేరాలు జరగడం ఆగిపోయిందని ఆయన చెప్పారు. జనవరి 2008 నుంచి 2008 జూలై వరకు అలాంటి చిన్న చిన్న ఘటనలు ఏవీ చోటుచేసుకోలేదని ఆయన చెప్పారు. అయితే దీంతో తాము ఇలాంటి నేరాలు ఎవరు చేస్తారా? అని దర్యాప్తు చేస్తే... అతనేనని తేలిందని, అతని ఫోటోను పలువురికి చూపించగా వారు కూడా అతనే దోషి అని గుర్తుపట్టారని ఆయన తెలిపారు.
తాము కేసును రీ కన్ స్ట్రక్షన్ చేసిన సమయంలో కూడా సత్యం బాబు చేసిన దారుణాన్ని కళ్లకు కట్టినట్టు వివరించాడని అన్నారు. అంతే కాకుండా, ఆయేషా మీరా బాడీ దగ్గర దొరికిన రక్తం నమూనాతో సత్యంబాబు డీఎన్ఏ సరిపోలిందని ఆయన చెప్పారు. ఇవన్నీ చూసిన తరువాతే తాము ఆయేషా మీరా కేసులో సత్యంబాబు దోషి అని చెప్పామని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుతోనే నిజం తేలిపోలేదని, సుప్రీంకోర్టుకు తాము వెళ్తామని ఆయన చెప్పారు. ఏవో టెక్నికల్ గ్రౌండ్స్ చూపించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని, అంతే తప్ప పోలీసులు తప్పు చేయరని ఆయన అన్నారు. కొన్ని వేల కేసులు డీల్ చేసే పోలీసులు, ఒకట్రెండు కేసుల్లో చిన్నచిన్న తప్పులు చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ఆయన తెలిపారు.