: 72 గంటల సమయమిస్తే.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తా: సీఎం కేజ్రీవాల్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కు ఆయన సవాల్ విసిరారు. తనకు 72 గంటల సమయాన్ని ఇస్తే కనుక ఈవీఎంలలోని సమాచారాన్ని తారుమారు చేయగలనని, ఈసీ నిపుణులు, కెమెరా సమక్షంలోనే ఈవిధంగా చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. ఈవీఎంల సాఫ్ట్ వేర్ ఏమిటో, దానిని ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో చెబుతానని కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం.
కాగా, త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను వినియోగించాలని ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఇటీవల విన్నవించుకున్నారు. కాన్పూర్ లో వాడిన సుమారు 300 ఈవీఎంలను మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించారని అన్నారు. ఇలా వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 45 రోజుల వరకు ఆయా ఈవీఎంలను మళ్లీ వాడకూడదని అన్నారు. యూపీ ఎన్నికల్లోనూ ఆ ఈవీఎంలనే వినియోగించారని.. నిబంధనలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని కేజ్రీవాల్ ఆరోపించారు.