: తనను ప్రేమించడం లేదంటూ ఎమ్మెల్యే కూతురిపై కత్తితో దాడి చేసిన యువకుడు
తనను ప్రేమించడం లేదంటూ ఏకంగా ఓ ఎమ్మెల్యే కూతురిపైనే ఓ యువకుడు దాడికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని యావత్మాల్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె(22) పై ఈ దాడి జరిగింది. ఆమె వాకాడ్‌లోని ఓ కళాశాలలో ఎంబీఏ విద్యార్థిని. అయితే, హర్యానాకు చెందిన ఓ యువకుడు(25) కూడా అదే కాలేజీలో చదువుతూ ఆమెను వేధిస్తున్నాడు. తనను ప్రేమించాల్సిందేనంటూ కొన్ని నెలలుగా ఆమె వెంటపడుతున్నాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ రోజు ఉదయం తమ కాలేజీ బయట ఆమెను అడ్డగించి, కత్తితో దాడికి దిగాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించి, నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ దాడితో ఆమె చేతులకు గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.