: వారు రాజీనామా చేయకపోతే అనర్హత వేటు వేయాలి: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీలోంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి పొందితే ఇదే చంద్రబాబు నాయుడు ఏ మాటలు మాట్లాడారో అందరూ ఓ సారి గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయడమంటే రాజకీయ వ్యభిచారమేనని అన్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో అదే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు స్పీకర్ కోడెల కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, వారి రాజీనామాలు ఆమోదం పొందేలా చూడాలని తాము గవర్నర్ నరసింహన్ను కోరామని చెప్పారు. వారు రాజీనామా చేయకపోతే వారిపై అనర్హత వేటు వేయాలని తాము కోరినట్లు తెలిపారు.