: మీ పెంపుడు పత్రిక అధినేత, మరో మీ ముద్దుల పెంపుడు వ్యక్తితో పుస్తకం రాయిస్తున్నారని విన్నాను: చంద్రబాబుకి ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఓ లేఖ రాశారు. తాను ఇప్పుడు పాత ముద్రగడను కాదని, మరింత రాటుదేలానని ఆయన అన్నారు. తనకు ఒక ధ్యేయంతో కూడిన పగమాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తనపై ఓ పుస్తకం రాయిస్తున్నాడని తనకు తెలిసిందని, ఎన్ని పుస్తకాలు రాసినా తాను ఉద్యమాన్ని వీడబోనని ఉద్ఘాటించారు. ‘తమరి ఆదేశాలతో మీ పెంపుడు పత్రిక అధినేత, మరో మీ ముద్దుల పెంపుడు వ్యక్తితో పుస్తకం రాయిస్తున్నారని విన్నాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా తాను మాత్రం కాపుల పోరాటం నుంచి వెనక్కు తగ్గనని తేల్చిచెప్పారు. తమను ఓడించాలని చూస్తే చంద్రబాబే ఓడిపోతారని ఆయన అన్నారు.
‘మీరు, మీ పెంపుడు మీడియా అధినేత పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో గోల్డు స్పూన్‌తో పుట్టారు. పెద్దగా చదువుకున్న వారు అప్పులు చేయవలసిన అవసరం లేదు. కానీ నా జీవితం మీలాంటిది కాదండి. నేను చదువులేని వ్యక్తిని, తెల్లవారితే అప్పుకోసం ఏదో దిక్కుచూడాలి. ప్రయాణం చేయాలంటే రూ.10వేలు, హైదరాబాద్ వెళ్లాలంటే రూ.50 వేలు అప్పుల కోసం రోడ్డెక్కాలి’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ‘పదవి కోసం ఎంత కిందికైనా దిగజారే వ్యక్తి మీరు.. ఆ దిగజారుడు తనం నాకు లేక పోవడం, నాపై మీకు అక్కసు ఉండడంతోనే తప్పుడు రాతలు రాస్తున్నారు’ అని ముద్రగడ అన్నారు.