: మండుతున్న ఎండలకు తట్టుకోలేక.. కల్లు తాగిన నాగరాజు!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రతకు జనాలు సొమ్మసిల్లిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, ఎండవేడిమికి తట్టుకోలేక, డీహైడ్రేషన్ కు గురైన ఓ నాగుపాము... చేసేదేమీలేక ఏకంగా కల్లు తాగేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో జరిగింది. ఈత చెట్టు ఎక్కిన నాగుపాము... చెట్టుపైన కట్టిన కల్లు కుండలోకి తల పెట్టి కల్లు తాగేసింది. ఈ విషయాన్ని గమనించిన ఓ స్థానికుడు, పాము కల్లు తాగుతున్న దృశ్యాన్ని తన మొబైల్ లోని కెమెరాతో బంధించాడు. మరోవైపు ఓ కింగ్ కోబ్రా ఇటీవలే జనావాసాల్లోకి వచ్చి, బాటిల్ ద్వారా ఓ వ్యక్తి పట్టించిన నీటిని తాగిన సంగతి మనందరికీ తెలిసిందే.