: ఇండియన్ షిప్ ను హైజాక్ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు!
భారత్ కు చెందిన ఓ కార్గో షిప్ ను సోమాలియా సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న ఈ షిప్ ను హైజాక్ చేశారని అధికారులు ధ్రువీకరించారు. 11 మంది సిబ్బందితో ఈ షిప్ దుబాయ్ నుంచి యెమెన్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రపు దొంగల చేతిలో బందీలుగా ఉన్న వారంతా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని విశ్వసనీయంగా తెలుస్తోంది. షిప్ హైజాక్ కు గురైనట్టు షిప్ కెప్టెన్ దుబాయ్ లోని సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత షిప్ హైజాక్ కు గురైనట్టు మన దేశ విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. హైజాకర్ల చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు అన్ని చర్యలను చేపడుతున్నట్టు భారత నౌకాదళ అధికారులు తెలిపారు.