: రాజీనామా చేస్తా.. అవసరమైతే కొత్త పార్టీ పెడతా: చింతమనేని ప్రభాకర్
ఏపీలో మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటికే తమ ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేస్తామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడంపై ఆ జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడుతూ, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అయితే, వేరే పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త రాజకీయపార్టీ స్థాపిస్తానని వెల్లడించారు. పార్టీలు మారి కార్యకర్తలను అవమానించలేనని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగాలని తాను అనుకోవడం లేదని, సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖను అందజేయాలని అనుకుంటున్నానని చింతమనేని అన్నారు.