: పుట్టిన రోజునాడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భూమా అఖిలప్రియ.. జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు!
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. మరికొద్ది సేపట్లో గవర్నర్ నరసింహన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటి వరకు ఈ జిల్లా నుంచి మహిళకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి భూమా అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి తరలివెళ్లారు. మరోవైపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా నుంచి సుబ్బరత్నమ్మ, భూమా శోభానాగిరెడ్డి, పాటిల్ నీరజారెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా మంత్రి పదవి ఎవరికీ దక్కలేదు. ఇప్పుడు తొలిసారిగా అఖిలప్రియకు ఆ అవకాశం దక్కబోతోంది. తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె 28 ఏళ్లకే మంత్రి కాబోతున్నారు. ఏపీ కేబినెట్‌లో ఆమె పిన్నవయస్కురాలు.