: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై యువకుల అసభ్య ప్రవర్తన.. కారును అడ్డుకునే యత్నం.. అరెస్ట్
కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరానీతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె కారును అడ్డగించే ప్రయత్నం చేసిన నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిలో ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. వారు మద్యం తాగినట్టు పరీక్షల్లో వెల్లడైంది. మయన్మార్ రాయబార కార్యాలయం సమీపంలో శనివారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నుంచి ఫిర్యాదు అందిందని, ఫ్రెంచ్ ఎంబసీ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చాణక్యపురి పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఎయిర్‌పోర్టు నుంచి కారులో ఇంటికి వస్తుండగా మోతీబాగ్ ఫ్లై ఓవర్ వద్ద కారులో ప్రయాణిస్తున్న యువకులు మంత్రి కారును సమీపించి ఆమె కారుతో సమానంగా పోనిచ్చారు. దీంతో ఆమె 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.