: జర్మనీ ఎయిర్‌పోర్టులో భారత మహిళపై జాతివివక్ష.. బట్టలిప్పి చూపించమన్న సెక్యూరిటీ సిబ్బంది!


జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయురాలు శ్రుతి బసప్ప (30)కు తీవ్ర అవమానం జరిగింది. ఐస్‌లాండ్ జాతీయుడిని వివాహమాడిన ఆమె ఆరేళ్లుగా అక్కడే ఉంటున్నారు. గత నెల 29న శ్రుతి భర్తతో కలిసి జర్మనీ మీదుగా భారత్ వస్తున్నప్పుడు ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఘోరంగా అవమానించారు. దుస్తులు విప్పేయమని అడిగారు. అయితే రెండు వారాల క్రితమే తనకు పొత్తికడుపు ఆపరేషన్ కావడంతో ‘ప్యాంట్ డౌన్ చెక్’ జాగ్రత్తగా చేయాలని సెక్యూరిటీ సిబ్బందిని శ్రుతి కోరారు. ఆపరేషన్ పత్రాలు చూపించబోతుంటే నిరాకరించిన సిబ్బంది దుస్తులు విప్పేసి చూపించాలని అడగడంతో ఆమె హతాశురాలైంది.

 దీంతో తన భర్త ఎదుటే తనను చెక్ చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనను పిలిపించారని, ఆయన యూరోపియన్ అని తెలియడంతో నిబంధనలు ఒక్కసారిగా మారిపోయాయని శ్రుతి తెలిపారు. ప్యాంట్ డౌన్ చెక్ సరిపోతుందని చెప్పి పంపించారని పేర్కొన్నారు. తన శరీరం రంగు కారణంగానే విమాన  సిబ్బంది తరచూ తనను ‘ర్యాండమ్ చెక్’కు ఎంచుకుంటున్నారని శ్రుతి ఆరోపించారు. యూరోపియన్లను బాడీ  స్కానింగ్ చేసి వదిలేస్తే తనను వళ్లంతా తడిమి (ప్యాంట్ డౌన్ చెక్) చేసేవారని తెలిపారు. సిబ్బంది తీరు జాతివివక్ష కిందకు వస్తుందంటూ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శ్రుతి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News